Take a fresh look at your lifestyle.

వనజ మృతిపై ఉన్నతస్థాయి విచారణ కమిటీ ఏర్పాటు.

0 21

వనజ మృతి ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కమిటీ ఏర్పాటు.
అన్ని కోణాల్లో దర్యాప్తుకు ఆదేశాలు.
విచారణకు హాజరైన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, జూన్ 19:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలానికి చెందిన గర్భిణి వనజ (21) మృతి ఘటనపై సమగ్ర విచారణ నిర్వహించేందుకు ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఘటనకు దారితీసిన పరిస్థితులు, వైద్య చికిత్సలో అనుసరించిన విధానాలు, అనంతర పరిణామాలపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టనున్నారు. వివరాల ప్రకారం, ఈ నెల 13న గుండాల ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ ఆధ్వర్యంలో వనజకు ప్రసవం జరగగా ఆడశిశువు జన్మించింది. అయితే శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో పాటు వనజకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఇద్దరినీ ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించగా శిశువు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వనజను ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో ఆమె మృతి చెందింది. అదే రోజు తల్లి, శిశువుల అంత్యక్రియలు స్వగ్రామంలో నిర్వహించారు. అనంతరం కర్మకాండలో భాగంగా గురువారం దహన స్థలం వద్ద అస్థికలు సేకరిస్తున్న సమయంలో శస్త్రచికిత్సల్లో ఉపయోగించే కత్తెర బయటపడినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుండాల ప్రభుత్వ ఆసుపత్రి అధికారులను ప్రశ్నించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు వెంటనే విచారణకు ఆదేశించారు. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుధీర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాథోడ్ తుకారామ్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ జి. రవిబాబు సభ్యులుగా ఉన్న కమిటీ విచారణ చేపట్టింది. ఈ కమిటీ వైద్య చికిత్స, రిఫరల్ ప్రక్రియ, ఆసుపత్రి నిర్వహణ, ఘటనకు సంబంధించిన ఇతర అంశాలపై సమగ్రంగా పరిశీలించి నివేదిక సమర్పించనుంది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా కమిటీ సిఫారసులు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.