Take a fresh look at your lifestyle.

సింగరేణి పెన్షనర్లకు ఎస్‌బీఐ సమగ్ర పెన్షన్ ప్యాకేజీ కల్పించాలి : రిటైర్డ్ ఉద్యోగుల వినతి.

0 14

సింగరేణి పెన్షనర్లకు ఎస్‌బీఐ సమగ్ర పెన్షన్ ప్యాకేజీ కల్పించాలి.
కొర్రెముల ఎస్‌బీఐ శాఖ మేనేజర్‌కు సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల వినతి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
ఘట్కేసర్, జూన్ 20:సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రత్యేక సమగ్ర పెన్షన్ ప్యాకేజీ అమలు చేయాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (సీఎంపీఎఫ్‌ఓ) ద్వారా పెన్షన్ పొందుతున్న రిటైర్డ్ ఉద్యోగుల తరఫున అసోసియేషన్ ప్రతినిధులు శనివారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని కొర్రెముల ఎస్‌బీఐ శాఖ మేనేజర్ శ్రీవర్ణికకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణుమాధవ్ మాట్లాడుతూ, సింగరేణి ఉద్యోగులు దశాబ్దాల పాటు దేశ బొగ్గు పరిశ్రమ అభివృద్ధికి విశేష సేవలు అందించారని తెలిపారు. ప్రస్తుతం వారి పెన్షన్లు సీఎంపీఎఫ్‌ఓ ద్వారా ఎస్‌బీఐ ఖాతాల్లో జమవుతున్నప్పటికీ, జాతీయ బ్యాంకు అందించే ప్రత్యేక పెన్షనర్ ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందడం లేదని పేర్కొన్నారు. సింగరేణి పెన్షనర్ల వయస్సు, ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కాంప్రిహెన్సివ్ పెన్షన్ ప్యాకేజీని అమలు చేయాలని కోరారు. ఇందులో ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా, తక్కువ ప్రీమియంతో ఆరోగ్య బీమా, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ, బ్యాంకింగ్ సేవలపై సర్వీస్ ఛార్జీల మినహాయింపు, ఉచిత చెక్‌బుక్లు, డెబిట్ కార్డులు, ఎస్‌ఎంఎస్ అలర్ట్‌లు, తక్కువ వడ్డీతో వ్యక్తిగత రుణాలు, వృద్ధులకు డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలు, ప్రత్యేక పెన్షనర్ హెల్ప్‌డెస్క్, ప్రాధాన్యత సేవలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలించి, ఉన్నతాధికారులకు పంపించి త్వరితగతిన అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పథకం అమలైతే వేలాది మంది సింగరేణి పెన్షనర్లకు ఆర్థిక భద్రతతో పాటు మెరుగైన బ్యాంకింగ్ సేవలు, సామాజిక రక్షణ లభిస్తాయని అసోసియేషన్ అభిప్రాయపడింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు కంచె బీరయ్య, రాజ నర్సు, ఏ. ప్రభాకర్, సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, ప్రకాశ్‌రావు, ప్రతాప్‌సింగ్, సర్జిత్‌సింగ్, మీరాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.