భూపాలపల్లిలో పారదర్శకంగా హెల్త్ గ్రౌండ్ క్వార్టర్ల కౌన్సిలింగ్.
31 దరఖాస్తుల్లో 25 మంది హాజరు..అర్హుల ఎంపిక ప్రక్రియ పూర్తి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, జూలై 4:సింగరేణి భూపాలపల్లి ఏరియాలో హెల్త్ గ్రౌండ్ కింద క్వార్టర్ల కేటాయింపునకు సంబంధించిన కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని శనివారం మైన్స్ రెస్క్యూ స్టేషన్లో పారదర్శకంగా నిర్వహించారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ ప్రక్రియలో మొత్తం 31 దరఖాస్తులు అందగా, 25 మంది అభ్యర్థులు హాజరై తమ వివరాలను సమర్పించగా, ఆరుగురు గైర్హాజరయ్యారు. హాజరైన అభ్యర్థుల దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించిన అధికారులు, వారి ఆరోగ్య పరిస్థితులు, వైద్య అవసరాలు, సంబంధిత అర్హతలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక ప్రక్రియను చేపట్టారు. కౌన్సిలింగ్ను పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఎంపికైన అర్హులైన ఉద్యోగులకు త్వరలోనే హెల్త్ గ్రౌండ్ కింద క్వార్టర్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఉద్యోగుల సంక్షేమానికి సింగరేణి యాజమాన్యం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం (సివిల్) రవికుమార్, ఇన్చార్జ్ ఎస్వో టు జీఎం కృష్ణప్రసాద్, ఏరియా ఇంజనీర్ రాజారావు, పర్సనల్ మేనేజర్ ఎస్. శ్యామ్ సుందర్, డాక్టర్ రాహుల్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సాయికృష్ణ, క్లరికల్ స్టాఫ్ రవి, ప్రణయ్ సాగర్, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ నాయకుడు చంద్రమౌళి, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బి. మధుకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.