రోజుకు 12.1 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ తొలగించాలి.
అధిక బొగ్గు ఉత్పత్తికి సవరించిన లక్ష్యాలను సాధించాలి.
అన్ని ఏరియాల జీఎంలకు సీఎండీ డా. బుద్ధప్రకాష్ జ్యోతి దిశానిర్దేశం.
(ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్, సెప్టెంబర్ 12:రాష్ట్ర విద్యుత్ అవసరాలకు అనుగుణంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలకు తగినంత బొగ్గు సరఫరా చేయాల్సి ఉన్నందున, ఓపెన్ కాస్ట్ గనుల్లో సవరించిన ఓవర్ బర్డెన్ (ఓబీ) తొలగింపు లక్ష్యాలను రోజువారీగా సాధించాలని సింగరేణి సీఎండీ డా. బుద్ధప్రకాష్ జ్యోతి అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లను ఆదేశించారు. శనివారం సింగరేణి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంస్థలోని 15 ఓపెన్ కాస్ట్ గనుల్లో ఓబీ తొలగింపు పనులు చేపడుతున్న 19 ఆఫ్ లోడింగ్ సంస్థల పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గును సరఫరా చేసేందుకు సింగరేణి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందన్నారు. దీనికి అనుగుణంగా ఓపెన్ కాస్ట్ గనుల్లో సవరించిన ఓబీ తొలగింపు లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 1,205 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ తొలగింపు లక్ష్యం కాగా, 101 శాతంతో 1,221 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీని తొలగించినట్లు తెలిపారు. అయితే 19 ఆఫ్ లోడింగ్ సంస్థల్లో ఆగస్టు నెలాఖరు నాటికి 8 సంస్థలు మాత్రమే 100 శాతం లక్ష్యాలను సాధించాయని పేర్కొన్నారు. మిగిలిన సంస్థలు కూడా పనితీరును మెరుగుపరుచుకుని లక్ష్యాలను సాధించాలని సూచించారు. సెప్టెంబర్‌లో మొదట రోజుకు 7.28 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ తొలగింపు లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ, పెరుగుతున్న బొగ్గు డిమాండ్‌కు అనుగుణంగా రోజువారీ లక్ష్యాన్ని 12.1 లక్షల క్యూబిక్ మీటర్లకు పెంచినట్లు సీఎండీ తెలిపారు. ఈ సవరించిన లక్ష్యాలను నిర్దేశిత సమయంలో సాధించేందుకు అవసరమైన యంత్రాలు, సిబ్బందిని సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. జేవీఆర్ ఓసీ, మణుగూరు ఓసీ, జీడీకే ఓసీ, ఆర్జీ ఓసీ-3, ఆర్జీ ఓసీ-2, కేటీకే ఓసీ-2, శ్రీరాంపూర్ ఓసీలలో ఓబీ తొలగిస్తున్న కొన్ని ఆఫ్ లోడింగ్ సంస్థలు లక్ష్యాల సాధనలో వెనుకబడి ఉన్నాయని సీఎండీ తెలిపారు. ఇప్పటివరకు వెనుకబడిన లక్ష్యాలను భర్తీ చేయడంతో పాటు తాజాగా నిర్దేశించిన రోజువారీ లక్ష్యాలను కూడా సాధించాలని సూచించారు. ప్రతి ఆఫ్ లోడింగ్ సంస్థ ఎన్ని షవల్స్, ఎన్ని డంపర్లు వినియోగిస్తోంది, నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు ఇంకా ఎన్ని యంత్రాలు అవసరమనే అంశాలపై సీఎండీ సమగ్రంగా సమీక్షించారు. కొత్త ఓపెన్ కాస్ట్ గనులకు సంబంధించిన ఓబీ తొలగింపు ఆఫ్ లోడింగ్ టెండర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి. సూర్యనారాయణ, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కె. వెంకటేశ్వర్లు, డైరెక్టర్ (ఈ అండ్ ఎం) ఎం. తిరుమల రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్మెంట్) బి. వెంకన్న, జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్ అండ్ మార్కెటింగ్) టి. శ్రీనివాస్‌తో పాటు అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు, కార్పొరేట్ జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.