Take a fresh look at your lifestyle.

108 మంది.. 108 నిమిషాలు.. 20 నృత్య వైవిధ్యాలు! : కీర్తి ఆర్ట్స్ అకాడమీ అద్భుత ప్రదర్శన.

0 28

108 మంది.. 108 నిమిషాలు.. 20 నృత్య వైవిధ్యాలు!
ఎక్సలెన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం కీర్తి ఆర్ట్స్ అకాడమీ అద్భుత ప్రదర్శన.
కళలతో పాటు చదువుకూ ప్రాధాన్యం ఇవ్వాలి: ఉప్పల శ్రీనివాస్ గుప్తా.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హైదరాబాద్, సెప్టెంబర్ 22: 108 మంది విద్యార్థులు.. 108 నిమిషాలు.. 20 నృత్య వైవిధ్యాలు.. వేదికపై కళా వైభవాన్ని ఆవిష్కరించిన ఈ వినూత్న ప్రదర్శన ఎక్సలెన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం కోసం కీర్తి ఆర్ట్స్ అకాడమీ చేపట్టిన ప్రత్యేక ప్రయత్నంగా నిలిచింది. హైదరాబాద్ ఆదర్శ్‌నగర్‌లోని బి.ఎం. బిర్లా సైన్స్ సెంటర్ భాస్కర ఆడిటోరియంలో ఆదివారం ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో 108 మంది విద్యార్థులు ఏకధాటిగా 108 నిమిషాల పాటు 20 వైవిధ్యాలతో నృత్య ప్రదర్శన ఇచ్చారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అచీవర్, కీర్తి ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షురాలు బిందు లిమ్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ సినీ, టీవీ నటుడు రాజేంద్ర, చినుకు కల్చరల్ సొసైటీ వ్యవస్థాపకుడు, రచయిత, మోటివేటర్ పి.ఎన్. మూర్తి, నటరాజ్ డాన్స్ స్కూల్ గురువు కుంబం అనితా కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ బిందు లిమ్మ ఆధ్వర్యంలోని కీర్తి ఆర్ట్స్ అకాడమీ వివిధ రంగాల్లోని ప్రతిభావంతులను గుర్తించి వారికి వేదిక కల్పించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు, గురువులకు మంచి పేరు తీసుకురావడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేసేలా కూచిపూడి, భరతనాట్యం, ఇతర కళలు, క్రీడల్లోనూ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. ప్రముఖ నటుడు రాజేందర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలోనూ ప్రతిభ దాగి ఉంటుందని, సరైన అవకాశం లభించినప్పుడే అది వెలుగులోకి వస్తుందని అన్నారు. విద్యార్థులు కళలను అభ్యసించినా చదువుకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కళల్లో రాణించడం ఒకవైపు, విద్య జీవితానికి శాశ్వతమైన భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి చేయకుండా, ఎంత కోపం వచ్చినా వారిని కొట్టవద్దని స్పష్టం చేశారు. పిల్లల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని కోరారు. పి.ఎన్. మూర్తి మాట్లాడుతూ కీర్తి ఆర్ట్స్ అకాడమీతో 2016 నుంచి తనకు పరిచయం ఉందని, 2017లో ఏర్పాటైన ఈ సంస్థ కళా రంగంలో నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతిభావంతులను ప్రోత్సహిస్తోందన్నారు. హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం, తిరుపతి, పశ్చిమ బెంగాల్, కేరళ, చెన్నై, కాశీ తదితర ప్రాంతాల్లోనూ కళా కార్యక్రమాలు నిర్వహిస్తూ కళాకారులకు అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. పిల్లలపై మెరిట్ పేరుతో అనవసర ఒత్తిడి చేయకూడదని, వారిని కొట్టకుండా ప్రేమతో మార్గనిర్దేశం చేయాలని పి.ఎన్. మూర్తి సూచించారు. ముఖ్యంగా బాలికలు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. కళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరిన్ని వేదికలను అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. అధిక అద్దెల కారణంగా మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద వేదికలపై కార్యక్రమాలు నిర్వహించడం భారంగా మారుతోందని, ప్రభుత్వ ఆడిటోరియంలను ఉచితంగా లేదా తక్కువ వ్యయంతో అందిస్తే మరింత మంది కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కీర్తి ఆర్ట్స్ అకాడమీ గురువులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.