పర్యావరణ పరిరక్షణకు ఇంపాక్ట్ ఫార్మర్స్ క్లబ్ ఖమ్మం కృషి.
తిరుమలాయిపాలెం రిజర్వ్ ఫారెస్ట్‌లో సీడ్ బాల్స్ విస్తరణ.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
ఖమ్మం, అక్టోబర్ 9: పర్యావరణ పరిరక్షణ, అటవీ విస్తరణ లక్ష్యంగా ఇంపాక్ట్ ఫార్మర్స్ క్లబ్ ఖమ్మం ఆధ్వర్యంలో సీడ్ బాల్స్ తయారీ, అటవీ ప్రాంతాల్లో వాటి విస్తరణ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ నిర్దేశించిన లక్ష సీడ్ బాల్స్ తయారీ లక్ష్యంలో భాగంగా క్లబ్ అధ్యక్షుడు బొమ్మగాని నరసింహారావు ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా తిరుమలాయిపాలెం మండలంలోని పులిగుట్ట రిజర్వ్ ఫారెస్ట్‌లో సీడ్ బాల్స్ విస్తరణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు విజయకుమారి, పాఠశాల సైన్స్, సోషల్ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. కూసుమంచి ఫారెస్ట్ రేంజ్ అధికారి పి. శ్రీనివాసరావు, డీఆర్ఓ కె.వి. రామారావు, నేలకొండపల్లి ఎఫ్ఎస్ఓ డేనియల్, ఎఫ్టీఓ ఎ. వెంకటేశ్వర్లు, అటవీ శాఖ సిబ్బంది సహకరించారు. సీడ్ బాల్స్ ద్వారా అటవీ విస్తరణ, జీవవైవిధ్య పరిరక్షణకు కలిగే ప్రయోజనాలను వివరించడంతోపాటు విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహన పెంపొందించారు. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ నిర్దేశించిన లక్ష సీడ్ బాల్స్ తయారీ లక్ష్యాన్ని చేరుకోవడంతోపాటు, వాటిని అటవీ ప్రాంతాల్లో విస్తరించేందుకు చురుగ్గా కృషి చేస్తున్న బొమ్మగాని నరసింహారావు, క్లబ్ సభ్యులను ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ రీజన్-3 ప్రాంతీయ అధ్యక్షుడు మహమ్మద్ నవాబ్ పాషా అభినందించారు. ప్రకృతిని కాపాడటం, పచ్చదనాన్ని పెంపొందించడం, భావితరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతని ఆయన పేర్కొన్నారు.