సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి
-
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
-
క్షేత్రస్థాయి అధికారులతో వీ.సీ ద్వారా సమీక్ష

నిజామాబాద్, ఆగస్టు 31 ( లోకంతీరు ) : సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి కలెక్టర్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా మండలాల ఎంపీడీఓ లు, ఎంపీఓ లు, పంచాయతీల కార్యదర్శులతో సమీక్ష జరిపారు. జిల్లాలో ఎక్కడ కూడా డెంగీ, చికున్ గున్యా, మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాలు వంటి వ్యాధులు ప్రబలకుండా క్షేత్రస్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా డెంగీ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. పారిశుధ్య పనులు పక్కాగా జరిగేలా నిరంతరం పర్యవేక్షణ చేయాలని, దోమల నివారణకు అన్ని నివాస ప్రాంతాలలో ఫాగింగ్ చేయించాలని, నిలువ నీరు ఉన్న చోట, మురుగు కాలువలలో ఆయిల్ బాల్స్ వేయాలన్నారు. రోజువారీగా పీ.హెచ్.సీ ల నుండి సీజనల్ వ్యాధులకు సంబంధించిన కేసుల నమోదు వివరాలను తెప్పించుకుని, ఎక్కడైనా డెంగీ కేసులు నమోదైతే చుట్టుపక్కల అన్ని నివాస గృహాల వద్ద నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బైటెక్స్, టేమీఫోస్, ఫైరిత్రాన్, మెలాథీన్ మందులను అన్ని గ్రామపంచాయితీలలో అందుబాటులో ఉంచుకోవాలని, వారానికి కనీసం రెండు పర్యాయాలు తప్పనిసరిగా పిచికారీ చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రానున్న రోజులలో సీజనల్ వ్యాధులు మరింతగా ప్రబలేందుకు ఆస్కారం ఉన్నందున, అక్టోబర్ నెలాఖరు వరకు అప్రమత్తతో కూడిన చర్యలు చేపట్టాలని హితవు పలికారు. ఎక్కడ కూడా తాగునీరు కలుషితం కాకుండా నీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.