రూఫ్‌టాప్ సోలార్‌పై మూడు రోజుల అవగాహన కార్యక్రమాలు.
కీసరలో అక్టోబర్ 2 నుంచి 4 వరకు ప్రత్యేక కార్యక్రమాలు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
ఘట్కేసర్, అక్టోబర్ 1:ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనలో భాగంగా రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ వ్యవస్థల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కీసరలో మూడు రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా విద్యుత్ శాఖ కీసర డీఈ టి. లింగయ్య తెలిపారు. అక్టోబర్ 2 నుంచి 4వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. కీసర డీఈ కార్యాలయం ఆధ్వర్యంలో సేవా సేతు/ఐసీఎస్సీ కేంద్రంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా లభించే ప్రయోజనాలు, దరఖాస్తు చేసుకునే విధానం, ప్రభుత్వం అందించే సబ్సిడీ, బ్యాంకుల ద్వారా లభించే ఆర్థిక సహాయం, ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై ప్రజలకు సమగ్రంగా వివరించనున్నట్లు చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మూడు రోజుల అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవాలని డీఈ టి. లింగయ్య సూచించారు.