Take a fresh look at your lifestyle.

సింగరేణి లాభాల్లో కార్మికులకు 36 శాతం వాటా ఇవ్వాలి : టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి.

0 3

సింగరేణి లాభాల్లో కార్మికులకు 36 శాతం వాటా ఇవ్వాలి.
వాస్తవ నికర లాభాలపై వాటా ప్రకటించాలి.

రెండేళ్లలో పక్కన పెట్టిన రూ.6 వేల కోట్ల లెక్క చెప్పాలి.
దసరాలోపు లాభాల వాటా ప్రకటించకుంటే ఆందోళన ఉధృతం.

టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని టౌన్, అక్టోబర్ 5: సింగరేణి సంస్థ గత ఏడాది ఆర్జించిన వాస్తవ నికర లాభాలపై కార్మికులకు కనీసం 36 శాతం వాటాను వెంటనే ప్రకటించి చెల్లించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి డిమాండ్ చేశారు. దసరాలోపు లాభాల వాటాపై స్పష్టమైన ప్రకటన చేయాలని, రెండేళ్లలో కార్మికుల వాటా పేరుతో పక్కన పెట్టినట్లు చెబుతున్న సుమారు రూ.6 వేల కోట్లకు సంబంధించిన పూర్తి లెక్కలను వెల్లడించాలని ఆయన ప్రభుత్వాన్ని, సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. లేదంటే కార్పొరేట్ కార్యాలయం నుంచి ప్రజాభవన్ వరకు ఎక్కడైనా ఆందోళనకు దిగేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. సోమవారం గోదావరిఖని రెండో గనిపై జరిగిన సమావేశంలో మాదాసి రామమూర్తి మాట్లాడుతూ, గత రెండేళ్లుగా సింగరేణి లాభాల్లో కార్మికులకు ఎంత వాటా వస్తుందో అన్ని కార్మిక సంఘాలు, ముఖ్యంగా టీబీజీకేఎస్ ప్రశ్నిస్తూనే ఉన్నాయని తెలిపారు. 2022-23లో అన్ని రకాల పన్నులు చెల్లించిన అనంతరం సింగరేణికి రూ.2,252 కోట్ల నికర లాభం వచ్చినట్లు అప్పటి సీఎండీ ప్రకటించారని, 32 శాతం లాభాల వాటా పేరుతో రూ.711 కోట్లు కార్మికులకు పంపిణీ చేశారని పేర్కొన్నారు. 2023-24లో పన్నుల అనంతరం రూ.4,701 కోట్ల లాభం వచ్చినట్లు ప్రకటించి, కార్మికులకు 33 శాతం వాటా ఇస్తున్నట్లు చెప్పినా వాస్తవంగా రూ.796 కోట్లు మాత్రమే పంపిణీ చేశారని రామమూర్తి ఆరోపించారు. ఇది నికర లాభాల్లో కేవలం 16.9 శాతమేనని పేర్కొన్నారు. సుమారు రూ.2,200 కోట్లను పక్కన పెట్టి కంపెనీ అభివృద్ధికి వినియోగిస్తామని యాజమాన్యం చెప్పిందని గుర్తుచేశారు. అదేవిధంగా 2024-25లో కార్మికుల శ్రమతో సింగరేణికి రూ.6,394 కోట్ల లాభం వచ్చినట్లు ప్రకటించి, 34 శాతం లాభాల వాటా ఇస్తున్నామని చెప్పినా రూ.802 కోట్లు మాత్రమే కార్మికులకు పంపిణీ చేశారని తెలిపారు. వాస్తవంగా చూస్తే ఇది కేవలం 12.5 శాతం మాత్రమేనని, లాభాల వాటా విషయంలో కార్మికులను మోసం చేస్తున్నారని విమర్శించారు. రెండేళ్లలో సుమారు రూ.6 వేల కోట్లను పక్కన పెట్టినట్లు చెబుతున్నా ఆ నిధులు ఎక్కడున్నాయి, ఏ విధంగా ఖర్చు చేశారు, దేనికి వినియోగించారు అనే విషయాలను యాజమాన్యం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి గనుల్లో కార్మికులకు బూట్లు లేవని, డ్రిల్లింగ్‌కు అవసరమైన డ్రిల్ బిట్లు, రాడ్లు అందుబాటులో లేవని, కార్మికుల క్వార్టర్లలో కనీసం ముఖం కడుక్కోవడానికి కూడా నీటి సమస్య ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల కోసం కేటాయించిన నిధుల పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని అన్నారు. గుర్తింపు సంఘం కాలపరిమితిపై వస్తున్న విమర్శల విషయంలో వ్యక్తిగత ఆరోపణలకు తాము తావివ్వడం లేదని రామమూర్తి స్పష్టం చేశారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన లేఖలో రెండేళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత అది ఆటోమేటిక్‌గా రద్దవుతుందని పేర్కొన్న అంశాన్నే తాము ప్రస్తావిస్తున్నామని తెలిపారు. కార్మికులకు ఏం చేయాలి, వారి హక్కులను ఎలా సాధించాలి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా ఏ విధమైన కార్యాచరణ చేపట్టాలనే దానిపై ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. కోల్‌బెల్ట్‌లో కార్మికుల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు, మంత్రులు వెంటనే ముఖ్యమంత్రిని కలిసి సింగరేణి లాభాల వాటాపై చర్చించాలని ఆయన కోరారు. దసరాలోపు లాభాల వాటా ప్రకటించే తేదీని వెల్లడించడంతో పాటు వాస్తవ నికర లాభాల ఆధారంగా ఎంత శాతం వాటా ఇస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గత రెండేళ్లలో పక్కన పెట్టినట్లు చెబుతున్న రూ.6 వేల కోట్ల నిధులపై కూడా ప్రభుత్వం, యాజమాన్యం పూర్తి వివరాలు వెల్లడించాలని కోరారు. గత ఏడాది వాస్తవంగా వచ్చిన నికర లాభాలపై కనీసం 36 శాతం వాటాను కార్మికులకు ఇవ్వాలని, అలా చేయకపోతే ఊరుకునే ప్రసక్తే లేదని రామమూర్తి హెచ్చరించారు. ఈ మేరకు గని మేనేజర్‌కు టీబీజీకేఎస్ పక్షాన వినతిపత్రం అందజేశారు. సమస్యపై తక్షణమే నిర్ణయం తీసుకోకపోతే కార్పొరేట్ కార్యాలయం, మెడికల్ బోర్డు, కొత్త బావుల సమస్యలపై కొనసాగుతున్న ఆందోళనలతో పాటు ఈ అంశంపైనా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. అవసరమైతే ప్రజాభవన్‌కు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కూడా వెనుకాడబోమన్నారు. కార్మికులందరూ ఈ పోరాటంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ జీడీకే-2 గని పిట్ సెక్రటరీ ఉప్పులేటి తిరుపతి, నాయకులు తొగరి నరేష్, పర్లపల్లి అభిషేక్, మధు, ప్రదీప్, రమేష్, కుమార్, ప్రవీణ్, యశ్వంత్, రవి, అనిల్, టిప్పు సుల్తాన్, శశికుమార్, శ్రీకాంత్, వేణు భీమ్‌రెడ్డి, శ్రీధర్, రాధాకృష్ణ, పాముకుంట్ల ప్రవీణ్, శివ, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.