దక్షిణ భారత ఇంధన భద్రతలో సింగరేణి కీలక భూమిక పోషించాలి : కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి.

దక్షిణ భారత ఇంధన భద్రతలో సింగరేణి కీలక భూమిక పోషించాలి.
10–15 ఏళ్ల దీర్ఘకాలిక కార్యాచరణతో ముందుకెళ్లాలి.
కొత్త బొగ్గు బ్లాక్లు సాధించాలి.. కోల్ గ్యాసిఫికేషన్‌లో అడుగుపెట్టాలి.
సింగరేణి అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం.
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి.
(ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్, జూలై 4: దక్షిణ భారతదేశంలో ఏకైక ప్రభుత్వ రంగ బొగ్గు ఉత్పత్తి సంస్థగా ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) దేశ ఇంధన భద్రతలో మరింత కీలక పాత్ర పోషించేలా 10 నుంచి 15 సంవత్సరాల దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సూచించారు. రానున్న బొగ్గు గనుల వేలంలో చురుకుగా పాల్గొని కొత్త బ్లాక్లు సాధించడంతో పాటు, కోల్ గ్యాసిఫికేషన్ వంటి భవిష్యత్ ఇంధన రంగాల్లోనూ అడుగుపెట్టాలని ఆయన ఆదేశించారు. సంస్థ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో శనివారం నిర్వహించిన సింగరేణి సంస్థ పనితీరు, భవిష్యత్ కార్యాచరణపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి ఈ మేరకు కీలక సూచనలు చేశారు. సమావేశంలో బొగ్గు ఉత్పత్తి, ఓవర్‌బర్డెన్ తొలగింపు, బొగ్గు రవాణా, కొత్త గనుల అభివృద్ధి, వివిధ ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులు, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలను గనుల వారీగా సమగ్రంగా సమీక్షించారు. దేశంలో విద్యుత్ అవసరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణి సంస్థ రాబోయే 10 నుంచి 15 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర వ్యూహాత్మక ప్రణాళిక రూపొందించాలని మంత్రి సూచించారు. బొగ్గు ఇంకా దీర్ఘకాలం దేశ ఇంధన రంగానికి వెన్నెముకగా కొనసాగనున్నందున ఉత్పత్తిని గణనీయంగా పెంచడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తూ, పనితీరును మెరుగుపరిచే ఆధునిక విధానాలను అమలు చేయాలని సూచించారు.
కొత్త బొగ్గు బ్లాక్ల సాధనపై దృష్టి:
బొగ్గు శాఖ నిర్వహించే రానున్న వాణిజ్య గనుల వేలంలో సింగరేణి చురుకుగా పాల్గొని కొత్త బొగ్గు బ్లాక్లను సాధించాలని మంత్రి స్పష్టం చేశారు. దక్షిణ భారతదేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చాలంటే సంస్థ విస్తరణ అనివార్యమని పేర్కొన్నారు.
కోల్ గ్యాసిఫికేషన్‌లో అడుగుపెట్టాలి:
దేశంలో కోల్ గ్యాసిఫికేషన్‌కు విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్న కిషన్ రెడ్డి, దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థగా సింగరేణి ఈ రంగంలోనూ ప్రవేశించాలని సూచించారు. ప్రారంభ దశలో చిన్న స్థాయి ప్రాజెక్టుతో ముందడుగు వేయాలని, ముఖ్యంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఎరువుల పరిశ్రమలు సహా ఇతర పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళిక:
ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం కారణంగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున, కోల్ ఇండియాతో పాటు సింగరేణి కూడా ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉత్పత్తి, నిల్వలు, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయాలని ఆదేశించారు. అదనపు బొగ్గు ఉత్పత్తికి అనుగుణంగా రవాణా వ్యవస్థను కూడా విస్తరించాలని, రవాణా కాంట్రాక్టులను వేగంగా ఖరారు చేసి వినియోగదారులకు సకాలంలో బొగ్గు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కార్మికులకు వాస్తవ పరిస్థితులు తెలియజేయాలి:
పోటీ మార్కెట్‌లో ప్రభుత్వ రంగ సంస్థలు నిలదొక్కుకోవాలంటే నాణ్యతా ప్రమాణాలు పెంపొందించడంతో పాటు ఉద్యోగుల్లో బాధ్యతాయుత భావన పెరగాలని మంత్రి పేర్కొన్నారు. సంస్థ ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులు, భవిష్యత్ సవాళ్లపై కార్మికులకు పారదర్శకంగా అవగాహన కల్పించాలని సూచించారు. సంస్థ భవిష్యత్ అభివృద్ధి, సంస్కరణల అమలుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, ఉద్యోగులను భాగస్వాములుగా చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ప్రతి ఉద్యోగి సంస్థ విజయాన్ని తన విజయంగా భావించేలా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని అన్నారు.
సింగరేణి సమస్యలను కేంద్రం పరిష్కరిస్తుంది:
సమావేశంలో సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి సంస్థ ప్రస్తుత పనితీరు, బొగ్గు ఉత్పత్తి, రవాణా, కొత్త ప్రాజెక్టుల అమలులో ఎదురవుతున్న సవాళ్లను వివరించారు. ముఖ్యంగా సింగరేణికి సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్ (CPSE) హోదా లేకపోవడం వల్ల అటవీ భూముల సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకునేలా చర్యలు చేపడతామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే ఒడిశాలోని నైనీ బొగ్గు గనిలో ఉత్పత్తి అవుతున్న బొగ్గు రవాణాకు సంబంధించిన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్, సంయుక్త కార్యదర్శి సంజీవ్ కుమార్ కస్సి, కేంద్ర మంత్రి ప్రైవేట్ సెక్రటరీ పంకజ్ జైన్, బొగ్గు శాఖ సలహాదారు వీరా రెడ్డి, సింగరేణి డైరెక్టర్లు ఎల్.వి. సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, గౌతమ్ పోట్రు, ఎం. తిరుమలరావు, ఈడీ (కోల్ మూవ్‌మెంట్) బి. వెంకన్న, జీఎం (కో-ఆర్డినేషన్ & మార్కెటింగ్) టి. శ్రీనివాస్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.