Take a fresh look at your lifestyle.

సింగరేణి మెడికల్ బోర్డుపై గొప్పలు చెప్పిన సంఘాలు ఇప్పుడు ఎందుకు మౌనం? : టీజీబీకేఎస్ అధ్యక్షుడు కేంగర్ల మల్లయ్య.

0 52

మెడికల్ బోర్డుపై గొప్పలు చెప్పిన సంఘాలు ఇప్పుడు ఎందుకు మౌనం?.

టీజీబీకేఎస్ అధ్యక్షుడు కేంగర్ల మల్లయ్య.

– కేవలం 24 మందినే అన్‌ఫిట్ చేసి యాజమాన్యం చేతులు దులుపుకుందన్నారు.
కార్మికులకు న్యాయం కోసం అన్ని సంఘాలు సమిష్టిగా పోరాడాలని పిలుపు.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, జూలై 19:సింగరేణి మెడికల్ బోర్డు నిర్వహణపై నిన్నటి వరకు గొప్పలు చెప్పుకున్న కార్మిక సంఘాలు, ఫలితాలు వెలువడిన తర్వాత కార్మికులకు జరిగిన అన్యాయంపై ఎందుకు నోరు మెదపడం లేదని తెలంగాణ బొగ్గు గని కార్మిక సమాఖ్య (టీజీబీకేఎస్) అధ్యక్షుడు కేంగర్ల మల్లయ్య ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన శనివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.  “మెడికల్ బోర్డును తమ ప్రభుత్వమే ఏర్పాటు చేయించిందని ఒక సంఘం, తమ సమ్మె నోటీసు ఫలితంగానే బోర్డు నిర్వహించారని మరో సంఘం ప్రచారం చేసుకున్నాయని, కానీ ఫలితాలు వెలువడిన తర్వాత కార్మికుల సమస్యలపై స్పందించడం లేదని” విమర్శించారు. మెడికల్ బోర్డులో కేవలం 24 మంది కార్మికులను మాత్రమే అన్‌ఫిట్‌గా ప్రకటించి సింగరేణి యాజమాన్యం చేతులు దులుపుకుందని ఆయన ఆరోపించారు. ఇందులో కూడా ఎక్కువ మంది గతంలో మెడికల్ బోర్డుకు హాజరై హయ్యర్ రిఫరల్‌కు పంపిన 33 మంది కార్మికుల నుంచే ఉన్నారని, కొత్తగా సాధించినదేమిటని ప్రశ్నించారు. భూపాలపల్లిలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు కాలేదని, గత నెల శ్రీరాంపూర్ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి కార్మికులకు న్యాయం జరిగేలా గత మెడికల్ బోర్డులకు భిన్నంగా వ్యవహరిస్తామని ప్రకటించినా, ప్రస్తుత ఫలితాలు ఆ హామీలకు విరుద్ధంగా ఉన్నాయని మల్లయ్య విమర్శించారు. కార్మికులు, కార్మిక సంఘాలు స్వార్థ రాజకీయాలకు అతీతంగా సమిష్టిగా పోరాడితేనే కార్మికుల హక్కులు పరిరక్షించబడతాయని ఆయన పేర్కొన్నారు. అధికారుల సంఘం మాదిరిగా అన్ని కార్మిక సంఘాలు ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తేనే భవిష్యత్తులో కార్మికులకు న్యాయం జరుగుతుందని కేంగర్ల మల్లయ్య పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.