
శాస్త్రీయ గని మూసివేతకు ప్రాధాన్యం: కిషన్ రెడ్డి.
వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి.
గనుల ప్రాంతాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు అమలు చేయాలని సూచన.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, ఆగస్టు 19: బొగ్గు గనుల తవ్వకాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, గని మూసివేత అనంతరం భూముల సుస్థిర వినియోగం, స్థానిక సమాజ అభివృద్ధి, ప్రత్యామ్నాయ జీవనోపాధి అవకాశాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గని మూసివేత కేవలం తవ్వకాలను నిలిపివేయడం కాదని, పర్యావరణ పునరుద్ధరణతో పాటు గని ప్రాంతాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. బుధవారం ఢిల్లీ నుంచి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శాస్త్రీయ గని మూసివేత, గని పునర్వినియోగం, గని మూసివేత అనంతరం భూముల సుస్థిర వినియోగంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడారు. స్వాతంత్ర్యం అనంతరం తొలిసారిగా దేశంలో 42 బొగ్గు గనులను శాస్త్రీయ పద్ధతిలో మూసివేయడం అతిపెద్ద మైలురాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా 105 బొగ్గు గనులను శాస్త్రీయంగా మూసివేయడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ రూపొందించిన వార్షిక నివేదికను మంత్రి ఆవిష్కరించారు. శాస్త్రీయ గని మూసివేతలో సాధించిన పురోగతి, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన సమగ్ర వివరాలను నివేదికలో పొందుపరిచినట్లు తెలిపారు. గని మూసివేత అనంతరం పర్యావరణ పునరుద్ధరణ, భూముల సుస్థిర వినియోగం, స్థానిక ప్రజలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పన, సమాజ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందన్నారు. భారత ప్రభుత్వం 2025 జనవరి 31న జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం దేశంలోని బొగ్గు కంపెనీలు గని మూసివేతకు సంబంధించిన ప్రక్రియను 2028–29 నాటికి పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు దీర్ఘకాలిక ప్రత్యామ్నాయ జీవనోపాధి ప్రణాళికలను రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మూసివేసిన బొగ్గు గనుల పునరుద్ధరణకు సాంకేతిక సహకారం అందించేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖతో కుదిరిన ఒప్పందాల ద్వారా అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానం, ఉత్తమ విధానాలను గని మూసివేత ప్రక్రియలో వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. కోల్ ఇండియా లిమిటెడ్ ఏర్పాటు చేసిన కోల్ నీర్ ప్లాంట్ల ప్రారంభంతో గని ప్రాంతాల్లో వనరుల సుస్థిర వినియోగం, పర్యావరణ పరిరక్షణకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జయశంకర్-భూపాలపల్లి కలెక్టరేట్ నుంచి రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ జీఎం రాజేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.