Take a fresh look at your lifestyle.

సింగరేణి పదవీ విరమణ కార్మికుల వైద్య హక్కులను కాపాడాలి : ఏఐటియుసి.

0 2

పదవీ విరమణ కార్మికుల వైద్య హక్కులను కాపాడాలి.
సీపీఆర్‌ఎమ్‌ఎస్‌లో రూ.8 లక్షల పరిమితి లేకుండా తీవ్రమైన వ్యాధులకు పూర్తి వైద్యం.

ట్రస్ట్‌కు రూ.500 కోట్లు అదనంగా జమ చేయాలి.
సీపీఆర్‌ఎమ్‌ఎస్‌, గ్రాట్యుటీ ట్రస్ట్‌ బోర్డు సమావేశంలో సీతారామయ్య, రాజ్ కుమార్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, సెప్టెంబర్ 10:పదవీ విరమణ కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా వారి వైద్య హక్కులను పరిరక్షించేందుకు సింగరేణి యాజమాన్యం తక్షణ చర్యలు చేపట్టాలని సింగరేణి గుర్తింపు సంఘమైన  ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్  రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్‌ డిమాండ్‌ చేశారు. సీపీఆర్‌ఎమ్‌ఎస్‌ పథకాన్ని మరింత బలోపేతం చేసి, తీవ్రమైన, ప్రాణాంతక వ్యాధులతో బాధపడే పదవీ విరమణ కార్మికులకు రూ.8 లక్షల పరిమితితో సంబంధం లేకుండా అవసరమైన పూర్తి స్థాయి వైద్యం అందించాలని కోరారు. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో గురువారం నిర్వహించిన సీపీఆర్‌ఎమ్‌ఎస్‌, గ్రాట్యుటీ ట్రస్ట్‌ బోర్డు సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు పదవీ విరమణ కార్మికులు ఎదుర్కొంటున్న వైద్య సమస్యలపై యాజమాన్యం దృష్టికి పలు కీలక అంశాలను తీసుకెళ్లారు. సీపీఆర్‌ఎమ్‌ఎస్‌ నిధులు, వైద్య సదుపాయాలు, హైదరాబాద్‌లోని ఆస్పత్రులకు రిఫరల్‌పై వెళ్లే కార్మికుల వైద్య భత్యం బిల్లుల చెల్లింపులు, గ్రాట్యుటీ ట్రస్ట్‌ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశం రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. పదవీ విరమణ అనంతరం కార్మికులకు వైద్య భద్రతే అత్యంత కీలకమని వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజేష్‌కుమార్‌ పేర్కొన్నారు. సీపీఆర్‌ఎమ్‌ఎస్‌ కార్డు నిబంధనల ప్రకారం అందుతున్న వైద్య సదుపాయాలను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా క్యాన్సర్‌, గుండె సంబంధిత వ్యాధులు, ఇతర తీవ్రమైన వ్యాధులకు దీర్ఘకాలిక చికిత్స అవసరమయ్యే సందర్భాల్లో రూ.8 లక్షల పరిమితి కారణంగా చికిత్సకు ఆటంకం కలగకుండా పూర్తి వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం సీపీఆర్‌ఎమ్‌ఎస్‌ ట్రస్ట్‌లో సుమారు రూ.116 కోట్లు మాత్రమే ఉన్నాయని ఏఐటీయూసీ నాయకులు తెలిపారు. పదవీ విరమణ కార్మికుల సంఖ్యతో పాటు వైద్య ఖర్చులు నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ట్రస్ట్‌కు అదనంగా రూ.500 కోట్లు జమ చేయాలని డిమాండ్‌ చేశారు. ట్రస్ట్‌ నిధులను ముందుగానే బలోపేతం చేస్తే పదవీ విరమణ కార్మికులకు భవిష్యత్‌లో మెరుగైన వైద్య సేవలు నిరంతరాయంగా అందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. హైదరాబాద్‌లోని ఆస్పత్రులకు రిఫరల్‌పై వెళ్లే పదవీ విరమణ కార్మికులు తమ వైద్య ఖర్చులను ముందుగా చెల్లించి, అనంతరం వైద్య భత్యం బిల్లుల కోసం ఎదురుచూడాల్సి వస్తోందని ఏఐటీయూసీ నాయకులు సమావేశంలో ప్రస్తావించారు. బిల్లుల పరిశీలన, ఆమోదం, చెల్లింపు ప్రక్రియలో జాప్యం కారణంగా రిటైర్డ్‌ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రిఫరల్‌ వైద్య బిల్లుల ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని, బిల్లుల పరిశీలన నుంచి చెల్లింపు వరకు వేగవంతంగా పూర్తి చేసే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌ కోసం వృద్ధాప్యంలో ఉన్న పదవీ విరమణ కార్మికులు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితిని నివారించాలని కోరారు. గ్రాట్యుటీ ట్రస్ట్‌కు సంబంధించిన అంశంపైనా ఏఐటీయూసీ నాయకులు కీలక డిమాండ్‌ను ముందుంచారు. కార్మికులకు చెల్లించిన గ్రాట్యుటీ మొత్తానికి సమానమైన మొత్తాన్ని గ్రాట్యుటీ ట్రస్ట్‌ నుంచి ఎల్‌ఐసీకి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గ్రాట్యుటీ నిధుల నిర్వహణలో కార్మికుల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు పదవీ విరమణ అనంతరం వారికి లభించే వైద్య భద్రత మరింత పటిష్టంగా ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు. సీపీఆర్‌ఎమ్‌ఎస్‌, గ్రాట్యుటీ ట్రస్ట్‌లను పటిష్టంగా నిర్వహించడం ద్వారా పదవీ విరమణ కార్మికులు, వారి కుటుంబాలకు వైద్యపరమైన భరోసా కల్పించాలని ఏఐటీయూసీ నాయకులు స్పష్టం చేశారు. కార్మికులు సింగరేణి సంస్థ అభివృద్ధికి తమ జీవితాలను అంకితం చేశారని, పదవీ విరమణ అనంతరం వారి వైద్య అవసరాలను నిర్లక్ష్యం చేయకుండా యాజమాన్యం బాధ్యతతో వ్యవహరించాలని వారు కోరారు.

Leave A Reply

Your email address will not be published.