కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం : జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, సెప్టెంబర్ 27: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, స్వాతంత్ర్యోద్యమంలో చురుకైన పాత్ర పోషించడంతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటం, సామాజిక న్యాయం కోసం ఆయన సాగించిన ఉద్యమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. సమాజంలోని అణగారిన వర్గాల హక్కులు, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం కోసం ఆయన చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, ఆర్ఐ రత్నం, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను స్మరించుకున్నారు.