0
పెద్దాసుపత్రులకు తీసిపోని పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి సేవలు.
విరిగిన పై దవడకు అత్యాధునిక శస్త్రచికిత్స విజయవంతం.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
పాల్వంచ, జూన్ 29:భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం మరోసారి తన వైద్య సామర్థ్యాన్ని చాటుకుంది. సాధారణంగా తృతీయ స్థాయి ఆసుపత్రుల్లో మాత్రమే నిర్వహించే క్లిష్టమైన ముఖ ఎముకల శస్త్రచికిత్సను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోనే విజయవంతంగా నిర్వహించి వైద్యులు రోగికి నూతన జీవం ప్రసాదించారు. పాల్వంచ మండలం ధాబా నగర్‌కు చెందిన 35 ఏళ్ల బానోత్ కరణ్ సింగ్ కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. ఎడమ ముఖ భాగానికి తీవ్ర గాయాలు కావడంతో ఆయనను పాల్వంచ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఆయన పై దవడ-చెంప ఎముకలు విరిగినట్లు గుర్తించారు. రోగి పరిస్థితిని పరిశీలించిన వైద్యుడు డాక్టర్ వంశీ అత్యవసర శస్త్రచికిత్సకు నిర్ణయించారు. దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన ఈ క్లిష్ట ఆపరేషన్‌లో టిటానియం ప్లేట్ల సహాయంతో విరిగిన ఎముకలను యథాస్థానంలో అమర్చడంతో పాటు ఐఎంఎఫ్ (ఇంటర్ మాక్షిలరీఫిక్సేషన్) ప్రక్రియ ద్వారా దవడలను స్థిరపరిచారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండి వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. ఈ శస్త్రచికిత్సను ఓరో-మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్ డాక్టర్ మోహన్ వంశీ కృష్ణ, మత్తు వైద్యుడు డాక్టర్ శంకర్రావు విజయవంతంగా నిర్వహించారు. నర్సులు పి. రేవతి, ఎస్. జ్యోతి, అలాగే శరీచి, జగదీష్ తదితరులు శస్త్రచికిత్సలో సహకరించారు. సాధారణంగా ఇలాంటి శస్త్రచికిత్సలకు ప్రైవేట్ లేదా కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు అవుతుంది. అయితే గిరిజన ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలోనే ఈ అత్యాధునిక చికిత్సను పూర్తిగా ఉచితంగా అందించడం విశేషం. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా నాణ్యమైన, అత్యాధునిక వైద్య సేవలు అందుతున్నాయనే విషయాన్ని ఈ ఘటన మరోసారి నిరూపించింది. విజయవంతమైన శస్త్రచికిత్స నిర్వహించిన వైద్య బృందాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ రవిబాబు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ ప్రసాద్, ఆర్ఎంఓ డాక్టర్ దొర అభినందించారు. గిరిజన ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. అలాగే ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న నిపుణుల వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.